– బాగేపల్లిలో పట్టుకున్న పోలీసులు
– అనంత ముఖ్యనేత గన్‌మెన్‌పై కేసు నమోదు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు వేసేందుకు నేతలు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో ఉన్న చేతి గడియారాలను ఓ కారులో తరలిస్తూ కర్ణాటక పోలీసులకు పట్టుబడ్డారు. అనంతపురం నుంచి బెంగళూరుకు సిఎం జగన్‌మోహన్ రెడ్డి చిత్రం ఉన్న 96 చేతి గడియారాలను కారులో తరలిస్తున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు చేస్తుండగా జగన్ ఫొటోలు ఉన్న వాచీలను గుర్తించారు. కారులో ఉన్న గన్‌మెన్ బండి నాగేంద్రపై కేసు నమోదు చేశారు. వాచ్‌లను తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో బెంగుళూరుకు వలస వెళ్లిన ఓటర్లకు వీటిని అందించేందుకు అనంతపురం జిల్లాకు చెందిన వైసిపి ముఖ్య నాయకుడు వీటిని తరలిస్తున్నట్లు సమాచారం.
