టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ.. మరో డిక్లరేషన్‌ ప్రకటన.!

Mar 5,2024 18:06 #bc jayaho sabha, #Mangalagiri

మంగళగిరి : తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సక్సెస్‌ కావడంతో అదే ఊపులో గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించే జయహో బీసీ సభ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. సభకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హాజరుకాబోతున్నారు. రెండు పార్టీలకు చెందిన 19 మంది నేతల కమిటీ తయారుచేసిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ను మంగళగిరి సభలో విడుదల చేస్తారు. బీసీలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, అన్నిరంగాల్లో అభివఅద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్‌ తయారుచేశామని రెండు పార్టీల నేతలంటున్నారు. అధికారంలోకి వస్తే బీసీల కోసం అమలు చేయబోయే పథకాలను సభలో వివరిస్తారు. 3 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్‌ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగు దేశం బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు.

ఇప్పటికే టీడీపీ సూపర్‌ సిక్స్‌లో బీసీ రక్షణ చట్టానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే బీసీ కులగణనకు హామీ ఇచ్చే అవకాశం ఉందని మంగళగిరి సభలో ప్రకటించే అవకాశముంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కులగణన ప్రక్రియలో ఉంది. దీంతో నేటి సభలో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌లో బీసీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. వైసీపీకి ధీటుగా బీసీలకు పథకాలు ప్రకటించే అవకాశముందని టీడీపీ-జనసేన వర్గాలంటున్నాయి. పార్టీలన్నీ బీసీ మంత్రం జపిస్తున్న తరుణంలో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌లో ఏఏ అంశాలుంటాయనే దానిపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

➡️