త్వరలో షెడ్యూల్‌ ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

రాజకీయ పార్టీలకు సిఇఓ విజ్ఞప్తి

బిజెపి మత ప్రచారాన్ని అడ్డుకోవాలని సిపిఎం వినతి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఐదారు రోజుల తరువాత ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసిపి తరుపున అంకంరెడ్డి నారాయణమూర్తి, తెలుగుదేశం పార్టీ తరుపున ఆలపాటి రాజేంద్రపసాద్‌, బిజెపి తరుపున అన్నపూర్ణ, సిపిఎం తరుపున వై.వెంకటేశ్వరరావు, జె.జయరామ్‌, కె.హరికిషోర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు నియమావళికి లోబడి ప్రవర్తించాలని, ఎటువంటి కార్యక్రమానికైనా ముందస్తు అనుమతి తప్పనిసరని చెప్పారు. కుల, మత, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయాలని అడగడం పూర్తిగా నిషేధమన్నారు. ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, పదివేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషేధమని చెప్పారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం మూడుగంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వారి వాహనాలు ఆపేయాలని కోరారు. అభ్యర్థితో కలుపుకుని మొత్తం ఐదుగురినే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్దకు అనుమతిస్తామని చెప్పారు. వ్యయంపైనా నిఘా ఉంటుందని, ప్రతి లోక్‌సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థికి రూ.40 లక్షలు వ్యయం చేసేందుకు అనుమతి ఉందని వివరించారు. ఈ వ్యయాన్ని కూడా సభ నిర్వహణ, పోస్టర్లు, వాహనాలు, బ్యానర్లకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : సిపిఎం

మతాన్ని ఎన్నికల్లో ఓట్లకోసం ఉపయోగించకూడదని స్పష్టంగా ఎన్నికల కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ చెబుతున్నప్పటికీ బిజెపి రామాలయం ఫొటోలను వినియోగిస్తోందని సిఇఓ దృష్టికి సిపిఎం తీసుకువెళ్లింది రామాలయంతోపాటు, బిజెపి గుర్తు, నాయకులు, అభ్యర్థుల ఫోటోలతో ఎక్కడికక్కడ హోర్డింగులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం కోరింది. ఈ మేరకు వినతిపత్రాన్ని సమావేశానికి హాజరైన ప్రతినిధులు సిఇఓకు అందజేశారు. బిజెపి తీరు ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్దమని వినతిపత్రంలో పేర్కొన్నారు. విగ్రహాలకు ముసుగులు వేస్తున్న నేపథ్యంలో ఇటువంటి హోర్డింగులు పెట్టడం ఖచ్చితంగా ఓటర్లను ప్రలోభపెట్టడమేనని, తక్షణం ఈ హోర్డింగులను తొలగించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ మతాన్ని, దేవుళ్లను ఉపయోగించే చర్యలను నిరోధించాలని కోరారు. వీటికి సంబంధించిన అధారాలతో కూడిన ఫోటోలను వినతి పత్రంతో జతపరిచారు. ఎన్నికల విధుల్లో వలంటీర్లను ప్రధాన బాధ్యతల్లో ఉపయోగిస్తున్నారని, ఎన్నికల కమిషనర్‌, కోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర మంత్రులు బహిరంగ సభల్లో, సమావేశాల్లో వలంటీర్లు వైసిపి గెలుపునకు తోడ్పడాలని వ్యాఖ్యలు చేస్తున్నారని, వారితో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వలంటీర్లకు తాయిలాలు పంచుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కెఎ పాల్‌ హడావుడిగుర్తింపు పొందిన పార్టీలతో ఎన్నికల కమిషన్‌ జరుపుతున్న సమావేశానికి ప్రజాశాంతి పార్టీ నాయకుడు కెఎ పాల్‌ వెళ్లారు. సెక్రటేరియట్‌ ఐదోబ్లాకు వద్ద ఆయనకు అనుమతి లేదని చెప్పడంతో తనను సమావేశం లోపలకు వెళ్లనివ్వాలని అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుండి పంపివేశారు.

➡️