హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు ఒకరని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించిన సందర్బంగా శనివారం బేగంపేటలోని పీవీ నర్సింహారావు భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీవీ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పీవీ నర్సింహా రావు కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన గౌరవం భారతరత్న అని పేర్కొన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎంతో విశేషమైన సేవలు అందించారని గుర్తుచేశారు. ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, కుమారుడు ప్రభాకర్ రావు, కార్పొరేటర్ టి.మహేశ్వరి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
