హైదరాబాద్ : నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లక్షకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఆశ కల్పిస్తారన్నారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాక వారిపై మత్తు మందు చల్లి పారిపోతారని పేర్కొన్నారు.నకిలీ నోట్ల ముఠాలో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు ఇద్దరు కామెరాన్, మాలి దేశస్థులుగా గుర్తించామన్నారు. బోడుప్పల్ వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల నకిలీ నోట్లతో పాటు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో విచారణ చేస్తామని సీపీ పేర్కొన్నారు.
