నర్సరావుపేట లోక్‌సభ బరిలో అనిల్‌కుమార్‌!

Jan 27,2024 08:03 #anilkumar, #narasaraopeta

-బిసి కార్డుతో విజయం కోసం వైసిపి వ్యూహం

-గుంటూరులో ఉమ్మారెడ్డి కుమారుడి పేరు పరిశీలన?

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:నర్సరావుపేట లోక్‌సభకు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ను వైసిపి తరుఫున పోటీ చేయించాలని సిఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం అనిల్‌కుమార్‌ను తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఈ విషయం చెప్పారు. ఆలోచించుకుని చెబుతానని అనిల్‌కుమార్‌ అనగా… ‘లేదు తప్పని సరిగా నర్సరావుపేట నుంచి నువ్వు పోటీ చేయాలి. గెలవాలి’ అని సిఎం జగన్‌ చెప్పినట్టు తెలిసింది. సామాజిక సమీకరణల్లో నర్సరావుపేట లోక్‌సభకు బిసి అభ్యర్థిని ఎంపిక చేయాలని సిఎం జగన్‌ రెండు నెలల క్రితమే నిర్ణయించారు. ఈ మేరకు నర్సరావుపేట సిట్టింగ్‌ ఎంపి లావు కృష్ణదేవరాయులును గుంటూరు నుంచి పోటీ చేయాలని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించి ఎంపి పదవికి, వైసిపికి రాజీనామా చేశారు. దీంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం బిసి నాయకుడు అనిల్‌కుమార్‌ను ఎంపిక చేశారు. పల్నాడు జిల్లాలో బిసిల జనాభా ఎక్కువగా ఉండడం, కొంతమేరకు ఏడు అసెంబ్లీల్లో వైసిపికి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం వల్ల బిసి కార్డును ఉపయోగించడం ద్వారా గెలుపు సునాయాసనం అవుతుందని ఐప్యాక్‌ సర్వే బృందాలు వైసిపి అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్‌ను తొలుత ప్రతిపాదించినా లోక్‌సభ పరిధిలోని ఏడుగురు వైసిపి ఎమ్మెల్యేలు అంతగా సుముఖత చూపలేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా అనిల్‌కుమార్‌ పేరును తెరపైకి తెచ్చారు. మరోవైపు టిడిపి తరుఫున లావు కృష్ణదేవరాయులు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఆయనను ఎదుర్కొనేందుకు దీటైన అభ్యర్థి అవసరం అని వైసిపికి సర్వే బృందాలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లోని బిసి అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. చివరికి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ వైపు సిఎం జగన్‌ మొగ్గు చూపారు. నెల్లూరులో ఉన్న గ్రూపు విభేదాల నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి తప్పిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ స్థానాలను టిడిపి ఒకే సామాజిక తరగతికి కేటాయిస్తుండడంతో ఇందుకు ప్రత్యామ్నాయంగా వేర్వేరు బలమైన సామాజిక తరగతులకు అవకాశం కల్పించాలని సిఎం జగన్‌ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా నర్సరావుపేట బిసిలకు, గుంటూరు కాపులకు ఇవ్వాలని యోచిస్తున్నారు. గుంటూరులో ఇంకా అభ్యర్థి ఎంపికపై అన్వేషణ కొనసాగుతోంది. క్రికెటర్‌ అంబటి రాయుడుకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినా, ఆయన అర్ధాంతరంగా పార్టీ నుంచి నిష్క్రమించడంతో ప్రత్యామ్నాయంగా మరో కాపు అభ్యర్థి కోసం ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వైసిపి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణను గుంటూరు లోక్‌సభకు ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.

➡️