బర్డ్‌ ఫ్లూ కలకలం -నెల్లూరు జిల్లాలో కోళ్లు మృతి

Feb 16,2024 21:55 #birdflu, #nelluru

-అధికార యంత్రాంగం అప్రమత్తం

– చికెన్‌ అమ్మకాలపై మూడు నెలలు నిషేధం

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. దీంతో, ఈ జిల్లాతో పాటు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయాయి. దీంతో, పశుసంవర్ధక శాఖ అధికారులు భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి శాంపిల్స్‌ పంపారు. ఎవిఎఎన్‌ ఇన్ఫ్లో ఎంజా నిర్ధారణ అయింది. దీంతో, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతాలకు వెళ్లి అధికారులు పరిశీలించారు. ఈ ప్రాంతాలకు పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజులపాటు, ఒక కిలోమీటరు పరిధిలో మూడు నెలల పాటు చికెన్‌ షాపులు తెరవకూడదని ఆదేశించారు. వ్యాధి సోకిన ప్రాంతం నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకూడదని, వేరే ప్రాంతం నుంచి కోళ్లను ఇక్కడికి తీసుకురాకూడదని సూచించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టించారు. కోళ్ల ఫారాలు, కోళ్ల వద్ద పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్‌ సిఇఒ ఆ రెండు గ్రామాల్లో ఎంపిడిఒ, పిఒపిఆర్‌డి, వెటర్నరీ డాక్టర్‌, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో కలసి గ్రామసభలు నిర్వహించి ప్రజలకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్‌ షాపు యజమానులకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్‌ చేయించారు. ప్రకాశం జిల్లా పశుసంవర్థ శాఖాధికారి డాక్టర్‌ కె.బేబీరాణి, జిల్లా వ్యాధి నిర్ధారణశాల ఉప సంచాలకులు డాక్టర్‌ యస్‌కె.కాలేషా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలోని కోళ్ల ఫారాలను సందర్శించారు. ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవిస్తే స్థానిక పశువైద్యాధికారుల దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. నెల్లూరు నుంచి కోళ్లు, కోళ్ల దాణా కొనుగోలును నిషేధించారు.

➡️