ప్రజాశక్తి-యంత్రాంగం:ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను పోలీసులు అడ్డుకుంటున్నారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుముదవల్లిలోని ఒక కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి వాసుదేవరావు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. కుముదవల్లి రైల్వే గేట్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా బ్యాగులో రూ.10 లక్షలు దొరికాయి. ఎటువంటి ఆధారాలు లేనందున నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని పాలకోడేరు మండలం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌ఛార్జి రామాంజనేయులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎఎస్‌ఐ మోహన్‌రావు, కానిస్టేబుల్ ప్రసాద్ ఉన్నారు.
శ్రీకాకుళంలోని తిమ్మాపురం కూడలి వద్ద తనిఖీల్లో బందిలిపురానికి చెందిన టేకు మోడీ నాగేంద్రప్రసాద్ వద్ద రూ.82,820, ఇలిసిపురం ప్రాంతానికి చెందిన గుత్తుల శ్రీను వద్ద రూ.54,630 నగదు దొరికాయి. శ్రీకాకుళం నుంచి పాలకొండ వైపు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని, రెండు బైక్‌లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు.
