బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ – విశాఖలో మహాపాదయాత్ర

– వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం

-కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ

-బిజెపిని ఓడిస్తేనే స్టీల్‌ప్లాంట్‌కు మనుగడ : నాయకుల స్పష్టీకరణ

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌, ఉక్కునగరం విలేకరులు : కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో దానితో అంటకాగుతున్న పార్టీలను ఓడిస్తేనే ఉక్కు ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యమవుతుందని విశాఖపట్టణంలో నిర్వహించిన మహాపాదయాత్రలో ప్రజానీకం ముక్తకంఠంతో నినదించింది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన ఆదివారం తలపెట్టిన మహా పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వేలాది పిడికిళ్లు ఉక్కు కోసం నినదించాయి. ఈ మహా పాదయాత్ర కూర్మన్నపాలెం కూడలిలోని ఉక్కు దీక్షా శిబిరం నుంచి ప్రారంభమై జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ సాగింది. వడ్లపూడి, శ్రీనగర్‌, పాత గాజువాక, ఎన్‌ఎడి, కంచరపాలెం మీదుగా సాగిన ఈ యాత్రకు ఎక్కడికక్కడ ప్రజలు ఎదురేగి పూలుజల్లి ఘన స్వాగతం పలికారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలని చూస్తోన్న బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకు పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. దేశ చరిత్రలోనే ఉక్కు పరిరక్షణ ఉద్యమం చిరస్థాయిలో నిలిచిపోతుందని తెలిపారు. చీలికలు సృష్టించి ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు బిజెపి చేస్తోన్న కుయుక్తులను పోరాట పటిమగల స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు తిప్పికొట్టాలని కోరారు. రాబోయే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు వచ్చినా స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు, ఉద్యమానికి హాని కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో బిజెపిని పూర్తిగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు పోరాటాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోన్న బిజెపికి రానున్న ఎన్నికల్లో కార్మికులు, నిర్వాసితులు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక వర్గం రాజకీయాలకు అతీతంగా పోరాడుతోందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోరాదన్నారు. బిజెపిని ఒంటరి చేసి ఓడించడం ద్వారానే స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోగలమని తెలిపారు. సమిష్టి పోరాట ఫలితంగానే మోడీ ప్రభుత్వం ఇంతవరకూ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మలేకపోయిందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. నవభారత నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ విషయమై తాను సిఎంతో మాట్లాడడానికి ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు జెవి.సత్యనారాయణమూర్తి, టిడిపి విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శ్రీభరత్‌, జనసేన పార్టీ పిఎసి సభ్యులు కోన తాతారావు, కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి రాకేష్‌ రెడ్డి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరాం, సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాసరావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గన్నారు. మహా పాదయాత్రకు విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసిపి గాజువాక ఇన్‌ఛార్జి ఉరుకూటి చందు తదితరులు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

➡️