సంపద సృష్టించే వారికి సహాయ, సహకారాలు అందిస్తాం :భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపద సృష్టికర్తలుగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైటెక్స్‌లో జరుగుతున్న బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా 31వ కన్వెన్షన్‌ కార్యక్రమం రెండో రోజు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ”సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలి. సంపద సఅష్టించే సంస్థలు వచ్చినప్పుడే.. ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదు. చాలా నిర్మాణ రంగ సంస్థలు బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టిన తర్వాత సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను సాధ్యమైనంత వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం” అని విక్రమార్క తెలిపారు.

➡️