హైదరాబాద్: నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో నగర నేర వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ”అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించాం. చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్ నిమజ్జనోత్సవం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి. మహిళలపై లైంగికదాడి కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది(2023) 403 నమోదయ్యాయి. సైబర్ నేరాలు 11 శాతం పెరిగాయి. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయి. పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయి. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కఅషి చేస్తోంది. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్‌ను వినియోగిస్తాం. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నాం” అని సీపీ వెల్లడించారు.
