బ్రాండిక్స్‌లో 1, 3 యూనిట్ల కార్మికుల సమ్మె

Feb 1,2025 21:21 #3 at Brandix, #strike, #units 1, #workers
  • జీతాలు పెంచాలని, వేధింపులు, అరగంట సమయం పెంపు ఆపాలని డిమాండ్‌

ప్రజాశక్తి -అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ కంపెనీ 1, 3 యూనిట్లలో శనివారం ఉదయం ఎ షిఫ్ట్‌ మహిళా కార్మికులు సమ్మె చేశారు. జీతాలు పెంచాలని, వేధింపులు ఆపాలని, టార్గెట్ల ఒత్తిడి తగ్గించాలని, అరగంట పని పెంపును ఉపసంహరించుకోవాలని, సీనియర్లకు గోల్డ్‌ కాయిన్‌ ఇవ్వాలని, ఇంటర్‌, డిగ్రీ చదివే తమ పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని, డస్ట్‌ అలవెన్స్‌, పిఎఫ్‌ సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్లతో నినాదాలు చేస్తూ ప్రధాన గేటు ఆవరణలో నిరసన చేపట్టారు. ఎ షిఫ్ట్‌కు వచ్చిన మహిళా కార్మికులు ఎండలో సాయంత్రం 4 గంటల వరకు పోరాటం కొనసాగించారు. తర్వాత బి షిఫ్ట్‌కు వచ్చిన మహిళా కార్మికులు పోరాటంలో పాల్గొని ఆందోళనను కొనసాగించారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరితే నెల రోజులు సమయం పడుతుందని పరిశ్రమ ప్రతినిధులు చెప్పడం విచారకరమని కార్మికులు తెలిపారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సిఐటియు ప్రతినిధుల అరెస్టులు

బ్రాండిక్స్‌ ఆవరణలో డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న మహిళా కార్మికులకు మద్దతుగా వెళ్లిన సిఐటియు నాయకులు కె.సోమనాయుడు, చింతకాయల శివాజీ, చలపతిలను పోలీసులు అక్రమంగా అరెస్ట చేశారు. వీరి అరెస్టును సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్రావు, ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, జి.దేముడునాయుడు, కోశాధికారి వివి.శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంటా శ్రీరామ్‌ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. సిఐటియు నేతల అరెస్టుపై రైతు ప్రజాసంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు.

➡️