గంజాయి రవాణ కేసులో 10 మంది అరెస్టు
ప్రజాశక్తి-విజయనగరకోట :విజయనగరంలోని బాబామెట్ట నుంచి డబుల్ కాలనీకి వెళ్లే దారిలో గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు నిందితులను, వేర్వేరు ప్రాంతంలో గంజాయి సేవించిన మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి వకుల్ వెల్లడించిన వివరాల మేరకు.. విజయనగరం 2వ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారంతో సిఐ కె రామారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మురళి, సిబ్బంది గురువారం బాబామెట్ట నుండి డబుల్ కాలనీకి వెళ్లే రహదారిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. గంజాయితో వెళుతున్న నలుగురు నిందితుల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన పటాన్ బాషా అలీ రెండేళ్లుగా బాబామెట్టలో నివాసం ఉంటున్నాడు. ఒడిశా – అరకు సమీపంలోని కించుమండ సంతలోని గుర్తుతెలియని వ్యక్తి వద్ద పది కిలోల గంజాయి కొనుగోలు చేసి, వాటిని ఇతరులకు విక్రయించే క్రమంలో పోలీసులకు అలీ పట్టుబడ్డాడు. అతనిపై ఇది వరకే గంట్యాడ పోలీసు స్టేషన్లో ఒక గంజాయి కేసు, బాపట్ల జిల్లాలో ఒక గంజాయి కేసు ఉన్నాయని తెలిపారు. అతనితో పాటు విజయనగరానికి చెందిన షేక్ కాశీషా, పాత్రో మారయ్య, భోగాపురానికి చెందిన తూతిక శ్యామ్ పట్టుబడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
గంజాయి సేవిస్తున్న విద్యార్థులు అరెస్టు
విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషను పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇంజనీరింగు, డిప్లమా, మోటల్ మేనేజెమెంటు, డిగ్రీ చదువుతున్న నలుగురు విద్యార్థులను, విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని, వారిపై కేసులు నమోదుచేసినట్లు ఎస్‌పి తెలిపారు. గంజాయికి సంబంధించి సమాచారం తెలిసిన వారు టాస్క్‌ఫోÛర్స్ పోలీసులకు 8712644836కు సమాచారాన్ని అందించాలని ఎస్‌పి కోరారు.
