108 కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె వాయిదా

  • యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి 108 అంబులెన్స్‌ సర్వీసెస్‌ కాంట్రాక్టు ఉద్యోగులు యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం నుంచి తలపెట్టదలచిన సమ్మెను వాయిదా వేసినట్లు యూనియన్‌ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణబాబు ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ వైద్య సేవా ట్రాస్ట్‌ సిఇఒ మంజుల, అదనపు సిఇఒ అప్పారావు, 108 నోడల్‌ అధికారి మురుగప్ప యూనియన్‌ నాయకులతో రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎ.వి నాగేశ్వరరావు, అధ్యక్షులు బల్లి కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మె నోటీసులో పలు అంశాలపై రాతపూర్వకంగా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. దీంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఆందోళన కాలంలో మద్దతు తెలియపరిచిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ట్రేడ్‌ యూనియన్ల నాయకులకు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులకు, సహకరించిన ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. చర్చల్లో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కెవివి నరసింహారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.శ్రీనివాస్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.మహేష్‌, ట్రెజరర్‌ ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️