ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌కు ఎస్కార్టుగా ఉన్న ఒక సిఐ, ఇద్దరు ఎస్‌ఐలు, మరో తొమ్మిది మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్‌పి సతీష్‌కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ సిఐ బి.సీతారామయ్యను విఆర్‌కు పంపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా అరండల్‌పేట సిఐ వీరాస్వామి, పట్టాబిపురం ఎస్‌ఐ రాంబాబు, నగరంపాలెం ఎస్‌ఐ రామాంజనేయులు, ఎఎస్‌ఐలు ఆందోని, ఏడుకొండలు, నగరంపాలేనికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్‌పేటలోని ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను అరెస్టు సందర్భంగా పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారన్న అభియోగాలతో గోరంట్ల మాధవ్‌తో సహా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా మాధవ్ పోలీసుల అనుమతి లేకుండా ఫోన్‌లో మాట్లాడారని, అధికారులపై దురుసుగా మాట్లాడినా ఉదాశీనంగా వ్వవహరిచారని, మీడియా ముందుకు మిగతా నిందితులతోపాటు వచ్చేందుకు మాధవ్ నిరాకరించినా ఏమీ చేయలేకపోయారనే కారణాలతో డిఎస్‌పిని విఆర్‌కు పంపి మిగతా వారిని సస్పెండ్ చేశారు.
