నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు

May 16,2024 21:19 #2024 election, #arest, #tirupahi
  • కడప జైలుకు తరలింపు

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇవిఎంల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద టిడిపి చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మందిని అదుపులో తీసుకొని, కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్‌పి కృష్ణకాంత్‌ పటేల్‌ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇవిఎం బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించేందుకు మహిళా యూనివర్సిటీకి వచ్చారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మెయిన్‌ గేటు వద్ద వైసిపి నాయకులు భానుకుమార్‌ రెడ్డి, గణపతి రెడ్డి, వారి అనుచరులు ముదిపల్లి జానకి రెడ్డి, జయ చంద్రారెడ్డి, పొదలకూరు కోదండమ్‌, బొక్కసం చిరంజీవి, దండు పుష్పకాంత్‌ రెడ్డి, ఎద్దల భాస్కర్‌ రెడ్డి, కామసాని సాంబ శివ రెడ్డి, అప్పన్నగిరి సుధాకర్‌ రెడ్డి, పి హరికష్ణ, పసుపులేటి రాము, గోగుల కోటయ్యలు పులివర్తి నానిని అడ్డగించి వారిపై సమ్మెట, రాడ్లు, క్రికెట్‌ బ్యాట్లు, రాళ్లు, బీర్‌ బాటిళ్లు వంటి వాటితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిని పులివర్తి నాని గన్‌మెన్‌ ధరణి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతనిపై కూడా సమ్మెటతో తీవ్రంగా దాడి చేశారు, రక్త గాయాలైన అతను తన ప్రాణ రక్షణ కోసం గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో భాను కుమార్‌ రెడ్డి, గణపతి రెడ్డి వారి అనుచరులు ఘటనా స్థలం నుండి పారిపోయారని తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా పోలీసులు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి విస్తతంగా గాలింపు చేపట్టారన్నారు. పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

➡️