14 మాణిక్యాలు -ఆడుదాం ఆంధ్రాలో గుర్తించామన్న సిఎం జగన్‌

Feb 14,2024 08:44 #ap cm jagan, #speech

-వారికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటన

-క్రీడాకారులను దత్తత తీసుకున్న సంస్థలు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం..ఆంధ్రా’ కార్యక్రమంలో ప్రోత్సాహమిస్తే మంచి ఫలితాలను సాధించగల మట్టిలో మాణిక్యాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘ఆడుదాం – ఆంధ్రా’ పోటీలు విశాఖ పిఎం.పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం ముగిశాయి. ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి పాల్గని క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. వీరి ప్రతిభకు సానబెడితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన 14 మందికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు వివిధ క్రీడలకు చెందిన అసోసియేషన్ల ప్రతినిధులు 47 రోజుల పాటు ఈ క్రీడల్లో ప్రత్యక్షంగా పాల్గని వీరిని గుర్తించారని చెప్పారు. వారిని దత్తత తీసుకుని అన్ని విధాల ప్రోత్సహించడానికి కూడా ఆ సంస్థలు ముందుకు వచ్చినట్లు సిఎం తెలిపారు. పురుషుల క్రికెట్‌లో పవన్‌ (విజయనగరం) కెవిఎం విష్ణువర్థిని (వైఎన్‌ఆర్‌జిల్లా)ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకొని మరింత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. మహిళల క్రికెట్‌లో శివ (అనపర్తి), గాయత్రి (కడప)ను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, కబడ్డీలో సతీష్‌ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్‌ (తిరుపతి)ని ప్రో కబడ్డీ టీమ్‌, కబడ్డీ మహిళా జట్టు నుంచి సంధ్య (విశాఖ)ను ఎపి కబడ్డీ అసోసియేషన్‌, వాలీబాల్‌కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళల విభాగంలో మౌనిక (బాపట్ల)ను బ్లాక్‌ హాక్స్‌ సంస్థ దత్తత తీసుకున్నట్లు చెప్పారు. ఖోఖోలో కె.రామ్మోహన్‌ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ను ఎపి ఖోఖో అసోసియేషన్‌, బ్యాడ్మింటన్‌లో ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఎపి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వీరికి మరింత శిక్షణ ఇచ్చి జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తామని అన్నారు. గామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని చెప్పారు. ఆడుదాం ఆంధ్రా ఆట ఒక్కసారికే పరిమితం కాదని ఏటా ఆడుకోవాలని కోరారు. ముగింపు క్రీడల్లో పాల్గన్న అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారులను పలుకరిస్తూ ప్రతి ఒక్కరి పేరును తెలుసుకుని సిఎం అభినందించారు.

25.40లక్షల మంది క్రీడాకారుల భాగస్వామ్యం

గ్రామ స్థాయి నుంచి 25.40లక్షల మంది క్రీడాకారులు ఆడుదాం ఆంధ్రా పోటీల్లో పాల్గన్నారని, 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిల్లో జరిగాయని సిఎం చెప్పాసరు. 1.24లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో జరిపామన్నారు. . జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జున మెమోంటోలు, బహుమతులను క్రీడాకారులకు అందించారు. వేదికపై మంత్రులు బత్స సత్యనారాయణ, ఆర్‌కె.రోజా, విడదల రజిని, మాజీ మంత్రి, భీమునిపట్నం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులున్నారు.

విజేతలు వీరే

క్రికెట్‌ పురుషుల విభాగంలో విజేతగా ఏలూరు 23వ సచివాలయం నిలవగా, మహిళల విభాగంలో ఎన్‌టిఆర్‌ కృష్ణ జిల్లా సిద్దార్ధ నగర్‌ సచివాలయం నిలిచింది. కబడ్డీ పురుషుల విభాగంలో విజేతగా బాపట్ల కొత్తపల్లి నిలవగా, మహిళల విభాగంలో విశాఖపట్నం జిల్లా లా సన్స్‌ బే సచివాలయం నిలిచింది. వాలీబాల్‌ పురుషుల విభాగంలో బాపట్ల పెటుపురి సచివాలయం, మహిళల విభాగంలో బాపట్ల నిజాంపట్నం-3 సచివాలయం, ఖోఖో పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జె.పంగులూరు సచివాలయం, మహిళల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. బ్యాడ్మింటన్‌ పురుషుల విభాగంలో ఏలూరు, మహిళల విభాగంలో బాపట్ల జిల్లా నిలిచాయి. విజేతగా నిలిచిన ఒక్కో జట్టుకు రూ.ఐదు లక్షల నగదుతో పాటు ట్రోఫీని ముఖ్యమంత్రి అందజేశారు. బ్యాడ్మింటన్‌ విజేతలకు రూ.మూడు లక్షలు, ట్రోఫీని అందజేసారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ట్రోఫీలతో సత్కరించారు.

➡️