1,58, 589 మంది మరణించారు
మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత 9 నెలల్లో 1,58,589 మంది పింఛన్‌దారులు మరణించారని సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. పింఛన్ లబ్ధిదారుల సంఖ్యపై వైసిపి సభ్యులు ఎం అరుణ్‌కుమార్, రమేష్ యాదవ్, తోట త్రిమూర్తులు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ తేడాది జూన్ నాటికి 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, ఫిబ్రవరి 2025 నాటికి ఈ సంఖ్య 63,59,907 మందిగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 14,967 సామాజిక పింఛన్లను తొలగించామని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసిపి సభ్యులు మాట్లాడుతూ 14,967 మాత్రమే తగ్గించామని చెప్పారని, కానీ మంత్రి చెప్పిన సమాచారం ప్రకారమే 158,589 తగ్గాయని తెలిపారు. అనర్హత పేరుతో దివ్యాంగులు, తదితర వారిని పింఛన్లు తొలగించారని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ వైసిపి సభ్యులు అసత్యాలు చెబుతున్నారని, గత 9 నెలల్లో 1,58,589 మరణించడం వల్ల పింఛన్ల సంఖ్య తగ్గిందన్నారు.తాము కేవలం 14,967 పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకొని వారిని శాశ్వత వలసదారులుగా పరిగణించి 10,791 మందిని, 4,176 మంది అనర్హులుగా గుర్తించి తొలగించామన్నారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శకాలనే పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు.
పరిశీలనలో ఆడబిడ్డ నిధి
ఎన్నికల్లో హామీఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారని వైసిపి సభ్యులు వరుదు కళ్యాణి, ఎస్ మంగమ్మ, టి కల్పలత అడిగారు. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500ల కింద ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని సభ్యులు గుర్తుచేశారు.