150 కేజీల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్టు

ప్రజాశక్తి – రాజానగరం(తూర్పు గోదావరి జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి డి.నరసింహకిషోర్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రంపచోడవరం నుంచి గామన్‌ బ్రిడ్జి రోడ్డులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరులోని అండర్‌ బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలను చూసి ఆటో, కారు వెనక్కి వెళ్లిపోవడాన్ని పోలీసులు గమనించారు. ఈ వాహనాలను పట్టుకుని తనిఖీ చేశారు. కారు డిక్కీలో 75 ప్యాకెట్లలో ఉన్న 150 కేజీల గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని ఎస్‌పి తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్‌ ఇంతియాజ్‌, షేక్‌ అబ్దుల్‌ సలీమ్‌, ఎఎస్‌ఆర్‌ జిల్లా రంపచోడవరానికి చెందిన సంకురు బుచ్చిరెడ్డి, ముర్ల చిన్నారెడ్డి అలియాస్‌ జెట్లీ, ఉలుగుల రవికిరణ్‌ రెడ్డి అలియాస్‌ పండులను అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన ఆటో, కారు, ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️