16న సమ్మెను జయప్రదం చేయండి- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

Feb 14,2024 08:09 #CITU, #sadassu

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :రవాణా రంగ కార్మికుల పాలిట శాపంగా మారిన క్రిమినల్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరగనున్న సమ్మెలో రవాణా రంగ కార్మికులంతా పాల్గని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు కోరారు. విజయనగరంలోని ఎన్‌పిఆర్‌ భవనంలో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరుకుల రవాణాలో లారీ, లగేజీ గూడ్స్‌, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లది కీలకస్థానమని అన్నారు. దేశ జిడిపికి రవాణా రంగం నుంచి 4.3 శాతం ఆదాయం వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించే విధంగా బిఎన్‌ఎస్‌ 106 (1) (2) హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కొత్త చట్టంలోని నిబంధనల వలన కోర్టులో బెయిల్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికులు ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నప్పటికీ వారి సంక్షేమానికి ఎటువంటి చట్టం చేయలేదని విమర్శించారు. డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేశారు. రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగే దేశవ్యాప్త ఒక రోజు సమ్మెలో డ్రైవర్లందరూ పాల్గని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో కరపత్ర ప్రచారం, సంతకాల సేకరణ చేయాలని, 16న కోట దగ్గర నుంచి కలెక్టరేట్‌కు వాహనాలతో ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి రాములు, సిఐటియు, లారీ అసోసియేషన్‌, ఆటో యూనియన్‌, శ్రామిక మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎపి మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️