- ఉపాధి కల్పన ఉపసంఘం చైర్మన్ లోకేష్
- తొలిసారి సమావేశమైన కమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమనివిద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి,ఉపాధి కల్పన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్ అన్నారు. ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం తొలిసమావేశం ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమన్వయలోపం లేకుండా లక్ష్యసాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఈ ఉద్యోగాలు కల్పించాని చెప్పారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లల్లో చెప్పుకునే స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు. పెట్టుబడులు తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పిపిఎలను రద్దు చేసి పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారని విమర్శించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యే చూడాలని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని అన్నారు.సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరగాలని, ఉద్యోగాలు కల్పిస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి అని తెలిపారు. నెలకు రూ.4వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తోందని వెల్లడించారు. కూటమి పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి కల్పనపై కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. లక్ష్యసాధనకు తమవంతు బాధ్యత వహించాలని, శాఖల మధ్య సమన్వయ లోపం ఉండకూడదన్నారు. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ వాణి ప్రసాద్, విద్య, పరిశ్రమ, పర్యాటక, కార్మిక శాఖల కార్యదర్శులు కోన శశిధర్, యువరాజ్, వినరు చంద్, గంధం చంద్రుడు, జెన్‌కో, పర్యాటక, స్కిల్‌డెవలప్‌మెంట్, ఎండిలు కెవిఎన్ చక్రధర్ బాబు, అమ్రపాలి,గణేష్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.