2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అవకాశం కల్పించాలి 

కృష్ణ-గుంటూరు జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : 2003 డీఎస్సీ అభ్యర్థులకు తప్పనిసరిగా పాత పెన్షన్ విధానాన్ని అవకాశం కల్పించాలని, కృష్ణ గుంటూరు జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం ఎంటిఎంసీ పరిధిలోని కుంచనపల్లి అరవింద హైస్కూల్లో డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మోపిదేవి శివశంకరరావు అధ్యక్షతన 2003 ఉపాధ్యాయుల సమస్యపై సమావేశం జరిగింది. సుమారు 500 మందికి పైగా డీఎస్సీ 2003 అభ్యర్థులు పాల్గొన్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లక్ష్మణరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాములో పిడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యo వహించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57 ప్రకారం, 2003 డిఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ కార్యదర్శి  జానకిని కలిసి 2003 అభ్యర్థుల పాత పెన్షన్ అమలు చేయాలని కోరామని అన్నారు. ఓపిఎస్ విధానం వచ్చేవరకు పోరాటంలో భాగస్వామ్యం అవుతామని, ఉద్యమాలలో సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. రేపు రాబోయే శాసనమండలి సమావేశాలలో ప్రస్తావన తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలుగుదేశం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ఇన్చార్జి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, తదితరులు పాల్గొని ప్రసంగించారు. 11వేల మందికి పైగా పాత పెన్షన్ ఇవ్వాల్సి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ, ఫోరం కన్వీనర్ ఎం గురుబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.

➡️