ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని (ఎన్‌టిఇపి) రాష్ట్రంలో పటిష్టంగా నిర్వహిస్తున్నామని వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టరు, రాష్ట్ర టిబి నివారణ అధికారి టి రమేష్ తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలో ఆరోగ్యశాఖాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్, ఫార్మా కళాశాల విద్యార్థులు, ఎన్‌టిఇపి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతోన్న టిబి కేసుల్లో దాదాపు 24 శాతం దేశంలోనే నమోదవుతున్నాయని, మరణాలూ ఎక్కువగా దేశంలోనే నమోదవుతున్నాయని తెలిపారు. ఈ వ్యాధిని పూర్తిగా రూపుమాపేందుకు రాష్ట్రంలో 720 ట్రూనాట్, 50 సిబినాట్ సెంటర్ల ద్వారా ఏటా పది లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అడల్డ్ బిసిజి వ్యాక్సినేషన్ పథకాన్ని ఈ సంవత్సరం చేపడుతున్నామని, మొదటిగా 12 జిల్లాల్లో నిర్వహించేందుకు సర్వే జరుగుతోందని చెప్పారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార భద్రత కల్పించేందుకు న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 95 వేల కిట్లను బాధితులకు అందించామని వివరించారు. క్షయ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు జె ఉషారాణి, ప్రమోద్ చలసాని, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
