ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇసెట్‌లో 21,023 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ కోర్సు రెండో సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఇసెట్‌ా2024 తుదిదశ కౌన్సెలింగ్ గురువారంతో ముగిసింది. సీట్ల కేటాయింపు ఆర్డర్లను సెట్ కన్వీనర్ గుమ్మల గణేష్ గురువారం విడుదల చేశారు. మొత్తం 240 కళాశాలల్లో 41,992 సీట్లు ఉన్నాయని తెలిపారు. వీటిల్లో 20,969 భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. 19 యూనివర్సిటీ కళాశాలల్లో 2,181 సీట్లు అందుబాటులో ఉండగా, 1,823 భర్తీ అయ్యాయని తెలిపారు. 221 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 39,741 సీట్లకు 19,146 సీట్లు భర్తీ చేశామని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో ఆన్‌లైన్ రిపోర్టింగ్‌తోపాటు కళాశాలల్లో కూడా నమోదు కావాల్సి ఉందన్నారు. ఈ నెల 14వ తేదీలోపు భర్తీ అయిన సీట్లు, విద్యార్థుల వివరాలను కళాశాలల యాజమాన్యాలు తమకు అందించాలని వెల్లడించారు.
