25 వేలతో మెగా డిఎస్‌సి : డివైఎఫ్‌ఐ వినతి

Jun 10,2024 22:26 #DYFI, #Mega DSC

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మెగా డిఎస్‌సిలో మొదటి దఫా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. రాష్ట్రంలో అధికారం చేపట్టనున్న టిడిపి, జనసేన కూటమికి ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా నూతన ప్రభుత్వం మెగా డిఎస్‌సి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మూసివేసిన పాఠశాలలను తెరిపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పార్లమెంటు చెప్పిన లెక్కలు ప్రకారం రాష్ట్రంలో 40 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇందులో తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండో దఫాలో మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నూతనంగా ఎన్నిక కాబోతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీ కోసం డివైఎఫ్‌ఐ అనేక పోరాటాలు చేసిందని, చలో సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేసిందని గుర్తుచేశారు. తమ నాయకులు, నిరుద్యోగులపై గత ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు.

➡️