27 నుంచి ప్రజాక్షేత్రంలోకి..

Mar 24,2024 22:10 #compain, #TDP, #YCP

– మేమంతా సిద్ధం పేరుతో వైసిపి
– ‘ప్రజాగళం’తో టిడిపి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రానున్న ఎన్నికలను రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే కేంద్రంలో అధికారంలో వున్న బిజెపితో తమ పార్టీలకే ముప్పు వచ్చే ప్రమాదం వుందని, దీంతో వ్యూహాత్మకంగా వైసిపి, టిడిపి ముందుకెళ్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని కాపాడుకునేందుకు వైసిపి, అధికారం చేజిక్కించుకునేందుకు టిడిపి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇన్నాళ్లూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటి బయటకు రావడం లేదని విమర్శలు ఎదుర్కొన్న వైసిపి అధినేత, సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 21 రోజులపాటు ప్రజల్లో వుండేలా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళి అర్పించి బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ఏప్రిల్‌ 18 వరకూ ఈ బస్సు యాత్ర సాగేలా వైసిపి కార్యాచరణ తయారు చేసుకుంది. ఈ బస్సు యాత్ర ప్రతి జిల్లా గుండా సాగుతుంది. ప్రతి జిల్లాలో రాత్రి బస చేసి పార్టీలో అసంతృప్తులను బుజ్జగించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే బస్సు యాత్ర సందర్భంగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతోపాటు రోజూ ఉదయం ఆయా జిల్లాల్లోని వివిధ తరగతులకు చెందిన పెద్దలు, ముఖ్యులతో సమావేశం కానున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించేలా టిడిపి ప్రజాగళం కార్యక్రమాన్ని రూపొందించింది. జనసేన, బిజెపితో పొత్తులో వున్న.. ఆ పార్టీ ఇప్పటికే చాలావరకూ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, తాగునీటి సమస్య తీవ్రంగా వుంది. ప్రధాన పార్టీలు వాటిపై దృష్టి సారించకుండా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునేందుకే పరిమితమవుతుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️