ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 4,10,000 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొత్తం 108 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. వీటిల్లో రాష్ట్రంలో 95 కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో 13 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ రెండు పూట్లా పరీక్ష ఉంటుంది. మొదటిది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పూట మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ వంటివి)లు తీసుకెళ్లాలని ప్రకటించింది. అభ్యర్థి ఒకంటి కంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.
