28 కేజీల గంజాయి స్వాధీనం – ఆరుగురు అరెస్టు

Oct 11,2024 19:54 #ganja seized, #Krishna district

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా) : ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కృష్ణాజిల్లా ఎస్‌పి గంగాధర్‌రావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీన కేరళకు చెందిన సాదిక్‌, ధనుష్‌లు ఒడిశాలోని కోరాపూట్‌లో సాధుమాజీ, హేమంత్‌ల వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి కేరళకు తరలించబోయారు. సాధిక్‌, ధనుష్‌లు తేలప్రోలు వద్దకు వచ్చేసరికి, పెట్రోలింగ్‌ డ్యూటీలో ఉన్న ఆత్కూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్న విషయం గమనించి యువకులు స్కూటీని అక్కడే వదిలేసి పక్కన పొలాల్లోకి పారిపోయారు. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు స్కూటీని తనిఖీ చేయగా అందులో సుమారు 28 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో గంజాయి రవాణా చేస్తున్న సాదిక్‌, ధనుష్‌లు, వారికి అమ్మిన సాధుమాజీ, హేమంత్‌, మరో ఇద్దరు కేరళ యువకులు నియాజ్‌, ఆగస్టిన్‌లను కూడా అరెస్టు చేసినట్లు ఎస్‌పి తెలిపారు.

➡️