ప్రజాశక్తి-సబ్బవరం (అనకాపల్లి జిల్లా), ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో 282 కిలోల గంజాయి పట్టుబడింది. అనకాపల్లి 16వ నెంబర్ జాతీయ రహదారిలో మర్రిపాలెం టోల్‌గేటు వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒడిశా నుంచి మహారాష్ట్రలోని కొల్లాపూర్‌కు ఐరన్‌లోడ్‌లో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్టు చేసినట్టు పరవాడ డిఎస్‌పి వి.విష్ణుస్వరూప్ తెలిపారు. అరెస్టయిన వారిలో అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం నురమాహి గ్రామానికి చెందిన దుకేరి రమణమూర్తి (37), అదేమండలం సబిడిమామిడి గ్రామానికి చెందిన దుర్గ బాలరాజు (31), మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన అనిల్ సురేష్ మర్చరేకర్ (42), కోల్లాపూర్‌కు చెందిన రాహుల్ రాకేష్ (22), సుమిత్ అమిత్ బాటింగే (19) ఉన్నారు. నిందితుల నుంచి 108 గంజాయి ప్యాకెట్లుతో ఉన్న 224 కిలోల గంజాయి, ఐసర్ వాహనం, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
విశాఖపట్నం జిఆర్‌పి ఇన్‌స్పెక్టర్ సిహెచ్.ధనంజయనాయుడు ఆధ్వర్యాన ఆర్‌పిఎఫ్/ఐపిఎఫ్ సిబ్బందితో కలిసి విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ ఫారం-1 సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రసన్ రాజ్ కిషోర్ బలియార్సింగ్, రాహుల్ పానీ, పింటు దాస్‌లు ముంబయికి గంజాయిని అక్రమంగా తరలిస్తుండడాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 58 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు పంపినట్లు ధనంజయనాయుడు తెలిపారు.