2వ రోజూ సిరమిక్‌ కార్మికుల ధర్నా

Jun 11,2024 22:06 #CITU, #Dharna, #Kakinada

ప్రజాశక్తి- సామర్లకోట(కాకినాడ జిల్లా) :తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా సామర్లకోట ఎడిబి రోడ్‌లోని రాక్‌ సిరమిక్‌ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట రెండో మంగళవారం కూడా ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, కార్మికులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతికుమార్‌ మాట్లాడుతూ కార్మికుల జీవితాలతో రాక్‌ పరిశ్రమ యాజమాన్యం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణమూ లేకుండా, ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా 25 మంది కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. 15 ఏళ్లుగా ఫ్యాక్టరీనే నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను అర్ధాతరంగా తొలగిస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. రాక్‌ సిరామిక్స్‌ యాజమాన్యం నిబంధనలను, కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. కంపెనీ లాభాల కోసం కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ కార్మికుల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు చంద్రశేఖర్‌, సతీష్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️