- తల్లికి వందనం, రైతులకు సుఖీభవ, మత్స్యకారులకు రూ.20 వేలు
- నియోజకవర్గ స్థాయిలోనూ గ్రీవెన్స్
- రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాత్రమే నిర్వహణ
- కడపలో మహానాడు
- టిడిపి పొలిట్‌బ్యూరో నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరో మూడింటిని జూన్‌లోగా అమలు చేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సహాయం, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని అందించాలని తీర్మానించింది. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం టిడిపి కార్యాలయంలోని ఎన్‌టిఆర్ భవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశ నిర్ణయాలను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌తో కలిసి మంత్రి కె అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. పాఠశాలలు తెరిచే నాటికి తల్లు ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రైతు భరోసా నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చెల్లిస్తామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు అందిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన తరువాత నిరుద్యోగ భృతి, ఆడపిల్ల నిధి, ఉచిత బస్సు ప్రయాణంతోపాటు మిగిలిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్ కంపెనీ భూములను ఆ కంపెనీ బాధితులకు అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులను జూన్‌లోపు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ 80 కార్పొరేషన్ల ఛైర్మన్లు, 48 వేల సాగునీటి సంఘాలను నియమించామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బిసిలకు తగ్గిన 10 శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మే 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 29న భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఇక శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుందని, మిగిలిన రోజుల్లో ఉండదన్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ ప్రతి ఎమ్మెల్యే శనివారం గ్రీవెన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడ వచ్చిన సమస్యలను జిల్లా అధికారులు, పార్టీ కార్యాలయం, మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులకు అందించి పరిష్కరించాలని చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు డిఆర్‌సి సమావేశంలో వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబున్యల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఊహించని దానికంటే సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రం ద్వారా రూ.11,400 కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చారని తెలిపారు. నందమూరి బాలకృష్ణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పద్మభూషణ్ అవార్డులు పొందిన వారికి పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపిందన్నారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ 1,0022,905 సభ్యత్వం చేశామని, తెలంగాణలో 1,70,367, అండమాన్‌లో 4,245 సభ్యత్వం చేశామని చెప్పారు.