పాఠశాలల ప్రహరీగోడలకు 3వేల కోట్లు

Mar 4,2025 00:56 #AP assembly meetings, #Lokesh
  •  దశలవారీగా పూర్తిచేస్తాం
  • శాసనసభలో మంత్రి లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీగోడల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. ఉపాధి హామీ, మన బడి-మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్‌తో దశలవారీగా నిర్మాణం చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ల్లో ప్రహరీగోడల నిర్మాణం, నాడు-నేడు అక్రమాలు, అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు, డ్రగ్స్‌ నివారణపై శాసనసభ్యులు అదితి గజపతిరాజు, శిరీషకుమారి, బండారు శ్రావణి, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు శాసనసభలో లోకేష్‌ సోమవారం సమాధానం చెప్పారు. ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లో పాఠశాలల్లో ఉన్న మౌలికసదుపాయాలు ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ ఇచ్చామన్నారు. నాడు-నేడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించి వివరాలు సేకరించి, వాటిని పూర్తిచేస్తామన్నారు. ఈ పనులపై అనేక ఆరోపణలు వచ్చాయని, ఈ అవకతవకలపై నివేదిక తెప్పించుకుని సభ్యులతో చర్చించిన తరువాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 117 ప్రత్నామ్యయంపై చర్చించిన తర్వాత టీచర్ల బదిలీలు, మౌలికసదుపాయలు కల్పిస్తామని చెప్పారు. కెజిబివిలకు నూరుశాతం ప్రహరీగోడలను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తిచేస్తామన్నారు. రాబోయే మూడు నెలల్లో సిసిటివి, లైటింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతో పాటు సభ్యులంతా భాగస్వాములు కావాలని కోరారు. ఖాళీగా ఉన్న 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వైసిపి సభ్యులు టి చంద్రశేఖర్‌, ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, మత్య్సలింగం, బి విరూపాక్షి పంపిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సిలు నిర్వహించి 1,80,272 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

➡️