ప్రపంచంలోనే మెరుగ్గా ‘మనమిత్ర’

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌పై లఘు చర్చలో మంత్రి లోకేష్‌ 
  • వందరోజుల్లో ఎఐ ఆధారిత వాయిస్‌ సేవలు
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టసవరణ
  • కార్యాలయాల చుట్టూ తిరగకుండా శాశ్వత పత్రాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మనమిత్ర పేరుతో అందిస్తున్న వాట్సాప్‌ సేవలను ప్రపంచంలోనే మెరుగైన సేవగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటిశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌పై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మనమిత్ర వాట్సాప్‌ ద్వారా అందిస్తామని తెలిపారు. 1983లో ఎన్‌టిఆర్‌ పటేల్‌, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారని, సింగపూర్‌ సిటిజన్‌ సర్వీసు ద్వారా సిఎం చంద్రబాబు ప్రేరణ పొంది విద్యుత్‌ బిల్లులను ఎలాక్ట్రానిక్‌ పద్ధతిలో తీసుకొచ్చారని తెలిపారు. ప్రైవేటు సేవలన్నీ ఇంటిముందుకు వస్తున్నప్పుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రావడం లేదనే అంశంపై ఆలోచన చేశామని, దానికి అనుగుణంగా ప్రభుత్వ సేవలను కూడా ఇంటిముందుకు తెచ్చేలా పాలన సాగిస్తున్నామని వివరించారు. ఆఫీసులకు వెళితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, లేనిపోని సమస్యలు వస్తున్నాయని వివరించారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో ఎంపిటిసిలు టిడిపి, జనసేన కలిసి గెలుచుకున్న రిజర్వేషన్‌ విషయంలో అప్పటి ఎమ్మెల్యే అడ్డుపడ్డారని, కుల ధ్రువీకరణ పత్రం అందకుండా చూశారని తెలిపారు. అక్కడ నుండే తనకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన మొదలైందని వివరించారు. విజిబుల్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజల చేతుల్లో పరిపాలన ఉండాలనేది తన నినాదమని తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో రాజకీయ నాయకులు, అధికారుల అవసరం ఉండకూదనే ఉద్ధేశంతోనే ఉన్నామని చెప్పారు. కొత్త యాప్‌తో అవసరం లేకుండా వాట్సాప్‌ ద్వారానే అన్ని సేవలు అందించే అవకాశాన్ని వినియోగించుకునేలా చేశామని తెలిపారు. ప్రస్తుతం 200 సేవలు అందిస్తున్నామని, తర్వాత వాటిని పెంచుతామన్నారు. సింగపూర్‌తో స్మార్ట్‌ నేషన్‌ ఇనిషియేటివ్‌ కింద ఎఐపవర్‌తో సేవలు అందిస్తున్నారని వివరించారు. యుఎఇ వంటి దేశాలు వాట్సాప్‌ ఆధారిత సేవలు అందిస్తున్నాయని, దీనిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని బలంగా నమ్ముతున్నట్లు వివరించారు. దీనిలో ప్రజలకు నేరుగా అందించే సేవలు, రెండోది హ్యూమన్‌ ఇంటర్వెన్స్‌, సంస్కరణలు అమలు ద్వారా సేవలు అందించడం వంటి పద్ధతులు పాటించనున్నట్లు తెలిపారు. ఒకసారి సర్టిఫికెట్‌ ఇచ్చాక మళ్లీ మళ్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా పర్మినెంట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. క్లిష్టతరమైన సేవలను చట్టాలను సవరించి సర్వీసులు అందుబాటులోకి తేస్తామని చెప్పారు. వీటికి ట్యాంపరింగ్‌ అవకాశం లేకుండా క్యూఆర్‌ కోడ్‌, ఎఐ ఎనేబుల్‌ చేశామని తెలిపారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. ఎపిపిఎస్‌సి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కూడా సమయం తీసుకుంటోందని, నూతన విధానంలో క్యూఆర్‌ కోడ్‌ వెరిఫికేషన్‌ సులభతరం చేస్తామని తెలిపారు. పేమెంట్స్‌ అన్నీ ఒకే ప్లాట్‌ఫాం మీదకు తీసుకొచ్చామని చెప్పారు. ఎఐ చాట్‌బాట్‌ ద్వారా బస్‌ టికెట్లు, ఇతర సేవలను వాయిస్‌ కాల్‌తో అందేలా చూస్తామని తెలిపారు. దేవాదాయశాఖలో 77 సేవలను మనమిత్రలోకి తీసుకొచ్చామని, టిటిడి సేవలను కూడా అందులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖకు సంబంధించి 39 సర్వీసులు అందిస్తున్నామన్నారు. మొత్తంగా 25 లక్షల సేవలు ఇప్పటి వరకూ అందించామని పేర్కొన్నారు. త్వరలో విద్యార్థుల ఫలితాలు కూడా వాట్సాప్‌ ద్వారానే పంపిస్తామని చెప్పారు. 2025 జనవరి నుండి 1.23 కోట్ల ట్రాన్సాక్షన్స్‌ జరగ్గా, వాట్సాప్‌ ద్వారా 41.4 శాతం అందించామని వివరించారు. ప్రజలు సులభంగా సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. దీనిలో ఎటువంటి హ్యాకింగ్‌ ఉండదని, గతంలో తప్పుడు ప్రచారం చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని సవాల్‌ చేశానని, స్పందన లేదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని వాట్సాప్‌ గవర్నెన్స్‌ కిందకు తీసుకొస్తామని చెప్పారు. ఈ చర్చలో సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, బొజ్జల సుధీర్‌రెడ్డి, నజీర్‌ అహ్మద్‌, ఎన్‌ ఈశ్వరరావు, లోకం మాధవి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఆదినారాయణరెడ్డి, కొణతాల రామకృష్ణ, జివి ఆంజనేయులు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బూర్ల రామాంజనేయులు, విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

➡️