వెట్టి చాకిరి నుంచి 33 మందికి విముక్తి

  • బాధితులకు రిలీఫ్‌ సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్‌

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : ప్రకాశం జిల్లాకు చెందిన ఏడు కుటుంబాల వారికి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగింది. అన్ని విధాలా అండగా ఉంటామని వారికి ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భరోసా ఇచ్చారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో బాధితులకు రిలీఫ్‌ సర్టిఫికెట్లను కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అందించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఆలూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జామాయిల్‌ తోటల్లో పనికి వెళ్లాయి. వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గర్భిణులు, బాలింతలతోనూ బలవంతంగా పని చేయిస్తున్నట్లు యానాది సంఘాల మహా కూటమి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగి ఏడు కుటుంబాల్లోని మొత్తం 33 మందికి విముక్తి కల్పించారు. వారిని ఒంగోలుకు తీసుకువచ్చారు. రిలీఫ్‌ సర్టిఫికెట్లతో పాటు మిఠాయిలు, దుస్తులు, ఇతర వంట సరుకులను జిల్లా కలెక్టర్‌ అందించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అమానవీయ స్థితిలో ఉన్న తమకు స్వేచ్ఛ కల్పించిన కలెక్టర్‌కు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌డిఒ కె.లక్ష్మీ ప్రసన్న, డిఎస్‌ఒ పద్మశ్రీ, పౌర సరఫరాల సంస్థ డిఎం వరలక్ష్మి, కొత్తపట్నం తహశీల్దార్‌ పిన్నిక మధుసూదనరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్‌.సునీల్‌ కుమార్‌ (సార్డ్స్‌), శ్యామ్‌, పాషా, డేవిడ్‌ (ఐజెఎం), ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️