కనీస వేతనం కోసం 36 గంటల దీక్షలు : రాష్ట్రవ్యాప్తంగా ఆశాల వంటా-వార్పు

  • పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలి : ధనలక్ష్మి

ప్రజాశక్తి – యంత్రాంగం : కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంబంధం లేని పనులు చేయించరాదని, పని భారం తగ్గించాలని, గ్రూప్‌ బీమా సౌకర్యం కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు 36 గంటల దీక్షకు దిగారు. ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. జీతాలు పెంచు తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా నేటి వరకు పెంచిన జీతం అమలు కావడం లేదని, వచ్చే జీతం లో సగం టిఎ, డిఎలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పలువురు ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాను ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రారంభించారు. ముందుగా స్థానిక ఏలూరు జ్యూట్‌ మిల్లు నుండి ఓవర్‌ బ్రిడ్జి, ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌, జిల్లా పరిషత్‌ సెంటర్‌ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధనలక్ష్మి మాట్లాడుతూ.. పెరుగు తున్న ధరలకు అనుగుణంగా తక్షణం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఆశా వర్కర్లకు రూ.10 లక్షల నష్టపరిహారమివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేలు జీతం ఇస్తున్నామనే పేరుతో 14 రకాల యాప్‌లు, 26 రిజిస్టర్లు నిర్వహించాలంటూ విపరీతమైన పనిభారం మోపిందని విమర్శించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలు అమలు చేయకుండా మాట తప్పి, మడమ తిప్పారని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నానుద్దేశించి ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) మాట్లాడుతూ..ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌ వద్ద, కాకినాడలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా శిబిరాలను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహిం చిన ధర్నాలో కె.ధనలక్ష్మి పాల్గొన్నారు. అమలాపురం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు హాజరై మద్దతు తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష శిబిరాన్ని ధనలక్ష్మి సందర్శించి మాట్లాడారు. 36 గంటల నిరసన ధర్నాలోపు కార్యకర్తల న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కరించాలని లేదంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, టిడిపి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ.. వారాంతపు సెలవులు, మెడికల్‌ లీవులు, మెటర్నిటీ లీవులు, ఇతర పండుగ సెల వులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నా రన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. అనంతపురంలో నిర సన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఆశ కార్య కర్తలను పోలీసులు అడ్డగించి అరెస్టులు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం, మడకశిర ప్రాం తాల్లో ఆర్‌టిసి బస్సులు, ఆటోల్లో వస్తున్న వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌లో ఉంచి తరువాత విడుదల చేశారు.

విజయవాడలోని ధర్నా చౌక్‌లో మహా ధర్నా, వంటా- వార్పూ చేశారు. రాత్రికి వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద ధర్నా ప్రారంభమైంది. అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం ఐటిడిఎ ఎదుట ధర్నాలు చేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టారు. ఆందోళనలో భాగంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టి అక్కడే భోజనాలు చేసి రాత్రి కూడా అక్కడే నిద్రించారు.

➡️