- మంత్రి వాసంశెట్టి సుభాష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఇఎస్‌ఐ ఆస్పత్రులను సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు. సచివాలయంలో కార్మికశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ పర్సన్ (ఐపి)లు ప్రస్తుతం 14.50 లక్షల మంది ఉన్నారని, ఈ సంఖ్యను 25 లక్షలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లోని డిస్పెన్సరీలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, పరికరాలను సమకూర్చేందుకు ప్రతిపాదనలు కోరారు. తనిఖీ అధికారులు లేకపోవడం వల్ల ఫ్యాక్టరీల్లో, షాపుల్లో పనిచేసే కార్మికులకు ఇఎస్‌ఐ సదుపాయం అందడం లేదన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైతే స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని ఆదేశించారు. తణుకు, నూజివీడులలో ఇఎస్‌ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ నుంచి డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ఉద్యోగోన్నతులకు చర్యలు చేపట్టాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన లేబర్ వెల్ఫేర్ బోర్డు పథకాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. చంద్రన్న బీమాకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయాలన్నారు. పెండింగ్‌లోని క్లెయిమ్స్ పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు, ఐఎంఎస్ డైరెక్టర్ ఆంజనేయులు, కార్మిక శాఖ జాయింట్, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.