లారీని ఢీ కొట్టిన ఆర్‌టిసి బస్సు

  • 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి-2 డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు గుర్రంకొండ నుంచి మదనపల్లికి వస్తుండగా మార్గమధ్యంలో కురబలకోట మండలం అంగళ్లు సమీపాన సర్కారు తోపు వద్ద ఆర్‌టిసి బస్సు-లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సహా 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న మదనపల్లి మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు సి.వెంకటసుబ్బయ్య, బస్సు డ్రైవర్‌ రామకృష్ణ, గుర్రంకొండ మండలం నడింకండ్రిగకు చెందిన రైతు గిరిబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, తిరుపతికి తరలించారు. బాధితులను మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌, ఎమ్మెల్యే షాజహాన్‌బాష, డిఎస్‌పి కొండయ్య నాయుడు పరామర్శించారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు సబ్‌ కలెక్టర్‌ తెలిపారు.

ఆర్తనాదాలతో అట్టుడికిన ఆస్పత్రి
మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మంచాలపై రక్త గాయాలతో ఉన్న ఆత్మీయులను పలకరించి.. ‘ఎలా జరిగింది నాయనా…! ఏం కాలేదు కదా’ అంటూ ఓదార్చి గుండెలకు హత్తుకోవడం చూపరులను కలచి వేసింది.

➡️