ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా):మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే స్మారక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల మహోత్సవం కెవిఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో గుంటూరు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా రాజ్యసభ ఎంపి మోపిదేవి వెంకటరమణ రావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఒ) పివిజె రామారావు హాజరయ్యారు. 42 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను వారు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 2008 నుండి జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను స్వయంగా ఎంపిక చేసి వారికి అవార్డులను అందజేయడం అభినందనీయమన్నారు. గేయానంద్, డిఇఒ రామారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తూ, గురువులను గుర్తించి వారి సేవలకు తగిన గుర్తింపునిస్తున్న లక్ష్మణరావును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ఎంపిపి రత్న ప్రసాద్ పాల్గొన్నారు.
