- విశాఖ పోర్టులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ పోర్టులోని 483 మెట్రిక్ టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యాన్ని సీజ్ చేశారు. పోర్టును మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యాన టీమ్స్ ఏర్పాటు చేశామని, వారు మిగతా వ్యవహారాలు చూస్తారని తెలిపారు. కాకినాడ పోర్టులో కొంత కాలంగా నిఘా పెరగడంతో విశాఖ పోర్టును అక్రమ రవాణా (స్మగ్లింగ్)కు గేట్‌వేగా కొందరు మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. గత రెండు నెలల్లో సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇలా తరలించారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి కోటీ 38 లక్షల మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం నుంచి 36 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని మూడేళ్ల కాలంలో తరలించారన్నారు.
అక్రమ రవాణా అడ్డుకునేందుకు రూ.12,800 కోట్లు
గడిచిన మూడేళ్లలో రూ.12 వేల కోట్ల విలువైన పిడిఎస్ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేశారని, అందుకే బియ్యం అక్రమ రవాణాపై ప్రక్షాళనకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని మంత్రి మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రూ.12,800 కోట్లు మేర ప్రభుత్వం ఖర్చు పెడుతోందని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. అనకాపల్లిలోనూ త్వరలో తనిఖీలు చేపడతామన్నారు.