ఆర్‌జిఎస్‌ఎ అమలులో రాష్ట్రానికి 4వ స్థానం

  • పిఆర్‌ కమిషనర్‌ కృష్ణతేజ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జిఎస్‌ఎ) అమలులో కేవలం 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానానికి చేరిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో 24వ స్థానంలో ఉండగా, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలతో 4వ స్థానానికి చేరిందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఎపి స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎపిఎస్‌ఐఆర్‌డిపిఆర్‌) సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది పంచాయతీరాజ్‌ సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన 3 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ 1.36 లక్షల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. మరో 1.04 లక్షల మందికి ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎపిఎస్‌ఐఆర్‌డిపిఆర్‌కు రెండు విడతలుగా రూ.22 కోట్లు అందించామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో తిరిగి పంచాయతీరాజ్‌ పరిధిలోకి తేచ్చారన్నారు. ఎపిఎస్‌ఐఆర్‌డిపిఆర్‌కు అమరావతిలో సొంత భవనాల నిర్మాణానికి కేంద్రాన్ని రూ.20 కోట్లు కోరామని, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాలను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.కోటి వ్యయంతో రాష్ట్ర స్థాయి దూర విద్య స్టూడియో ఏర్పాటు, ఇ-కోర్సు మాడ్యూళ్లను రూపొందించనున్నట్లు చెప్పారు. 9 పంచాయతీ లెర్నింగ్‌ సెంటర్‌లు (పిఎల్‌సి) ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాధికారత, సంస్కరణల సాధనలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.

➡️