5 కీలక వింగ్స్‌ ఆధునిక టెక్నాలజీతో గంజాయి సాగుకు చెక్‌

  • ఐజి (ఈగిల్‌) రవికృష్ణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గంజాయి సాగు, మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ అమ్మకాలు, రవాణాను అరికట్టేందుకు ఐదు విభాగాలతో ప్రత్యేకంగా వింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు యాంటి నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈగిల్‌) ఐజి రవికృష్ణ తెలిపారు. మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశోధన, లీగల్‌ వింగ్‌, డాక్యుమెంటేషన్‌ ట్రైనింగ్‌, అవేర్‌నెస్‌ వింగ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ వింగ్‌, టాస్క్‌ఫోర్స్‌ వంటి కీలక విభాగాలు ఏర్పాటుకు మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయన్నారు. ఈగిల్‌ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.8.59 కోట్లు కేటాయించిందన్నారు. ఇంట్లోకి డ్రగ్స్‌ రాకుండా ప్రతి తల్లి బాధ్యత తీసుకుని ఈగిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు చేస్తుండటం దురదృష్టకరమన్నారు. గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులు, రవాణా చేసే వ్యక్తులపై ఆధునిక టెక్నాలజీ సహాయంతో గట్టి నిఘా పెడుతున్నామన్నారు. డ్రగ్స్‌, గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం అందిం చాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టోల్‌ ఫ్రీ నెంబరు 1972 అన్ని వేళలా పనిచేస్తుందన్నారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎన్‌డిపిఎస్‌ కేసుల్లో ముద్దాయిల ఫొటోలను ఆయా సచివాలయం / పోలీస్‌ స్టేషన్‌ నోటీస్‌ బోర్డులో పెట్టి అందరికీ తెలిసేలా చేస్తామన్నారు. అమరావతిలో ఈగిల్‌ హెడ్‌ క్వార్టర్స్‌, ప్రత్యేక నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రగ్స్‌ నియంత్రణ కోసం 459 మంది సిబ్బంది పనిచేస్తారన్నారు. నార్కోటిక్‌ ప్రధాన పోలీస్‌ స్టేషన్‌లో 66 మంది పోలీసు అధికారుల బృందం సేవలందిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌పి (ఈగిల్‌) నగేష్‌బాబు పాల్గొన్నారు.

➡️