5 పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు

Sep 27,2024 23:59 #AP CM Chandrababu Naidu, #AP MOU

– ఎన్‌హెచ్‌పిసితో ఒప్పందం కుదుర్చుకున్న జెన్‌కో
 సిఎం చంద్రబాబు సమక్షంలో ఎంఒయు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఐదు చోట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఎపి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఎపి జెన్‌కో), నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పిసి)ల మధ్య ఒప్పందం కుదిరింది. 5,070 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఎన్‌హెచ్‌పిసి సిఎమ్‌డి రాజ్‌కుమార్‌ చౌదరి, జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌బాబు సచివాలయంలో సంతకాలు చేశారు. రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులు ప్రారంభించేలా ఒప్పందం కుదిరింది. పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్‌హెచ్‌పిసి, జెన్‌కో మధ్య జరిగిన ఈ ఒప్పందం కీలకమని సిఎం చంద్రబాబు అన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు, ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు ఆవశ్యకత ఉందన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును భద్రపరిచే గొప్ప మార్గదర్శకమని చెప్పారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్‌గా ఈ ఒప్పందం పనిచేస్తుందన్నారు. దేశ, రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను సుస్థిరంగా తీర్చడానికి సహాయపడుతుందని తెలిపారు. జెన్‌కో ఎమ్‌డి చక్రధర్‌ బాబు మాట్లాడుతూ.. ఎగువ సీలేరు (1,350 మెవా) కమలపాడు (950 మెవా) పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో పూర్తి సహకారం జెన్‌కో అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో జెఎమ్‌డి సిహెచ్‌ కీర్తి, సిపిడిసిఎల్‌ సిఎమ్‌డి రవి సుభాష్‌ పటాన్‌ తదితరులు పాల్గన్నారు.

➡️