- ఎంపి ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : చట్టసభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో బిసి జాక్ జిల్లా అధ్యక్షులు సుందర్ రాజ్ యాదవ్ అధ్యక్షతన ‘బీసీల రాజకీయ యుద్ధభేరి’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో కృష్ణయ్య మాట్లాడుతూ.. బిసిలు ఉద్యమ పంథా మార్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జాట్‌లు చేసిన ఉద్యమంతో వారికి రిజర్వేషన్లు దక్కాయన్నారు. అగ్ర కులాల లెక్కలు లేకున్నా రిజర్వేషన్లు పెట్టి వారికి అమలు చేస్తుంటే కోర్టులు జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. బిసిలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంటే నిలిపివేస్తున్నాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చైనా బిసిలకు రిజర్వేషన్లను పెంచాలని, లేదంటే సుప్రీంకోర్టు తన నిర్ణయాన్నైనా మార్చుకోవాలని కోరారు. ఐక్యంగా తెగించి పోరాడితే బిసిలకు రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను పెంచకపోతే రాష్ట్రం రణరంగమవుతుందని హెచ్చరించారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు పిల్లల్ని బాగా చదివించాలన్నారు. 75 ఏండ్లలో బీసీ ముఖ్యమంత్రి ఒక్కరూ కాలేదన్నారు.
తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం లేదు : రాజ్యసభ సభ్యులు విల్సన్
తమిళనాడులో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేయడం లేదని రాజ్యసభ సభ్యులు విల్సన్ తెలిపారు. దేశంలో తమిళనాడులో మాత్రమే 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని తెలిపారు. 50 శాతం బిసిలకు, 18 శాతం ఎస్‌సిలకు, 1 శాతం ఎస్‌టిలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2, 3 శాతం జనాభా లేని కులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మనం మేల్కొవాలని, సమయం ఆసన్నమైందని, మీరంతా ఢిల్లీకి వచ్చి కేంద్రానికి హెచ్చరిక చేయాలని తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిసి అభ్యర్థులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కులగణనలో బీసీల లెక్క తేలినందున రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఈ సభలో బిసి మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, బిసి మేధావుల ఫోరం కన్వీనర్, పూర్వ ఐఎఎస్ అధికారి టి. చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.