వైద్య రంగానికి జిడిపిలో 6 శాతం కేటాయించాలి :  ప్రజారోగ్య వేదిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర జిడిపిలో 6 శాతం మొత్తాన్ని ఈ రంగానికి బడ్జెట్‌లో కేటాయించాలని ప్రజారోగ్య వేదిక పేర్కొంది. వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయ్ ప్రకాష్‌, నాయకులు పిబి రామావతారం, కెఎస్‌బి ప్రసాద్‌.. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, సిఎంఒ అధికారులను సచివాలయంలో కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ (5) నివేదిక ప్రకారం రాష్ట్రంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 31.20 శాతం ఎదుగుదల లోపం, 29.60 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. మహిళలు, పిల్లల్లో రక్తహీనత అధికంగా ఉన్నట్లు పోషల్‌ డేటాలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యానికి చేస్తున్న ఖర్చు సిఫార్సు చేసిన దానికంటే తక్కువగా ఉందన్నారు. జిడిపిలో 0.87 నుంచి 1.24 శాతం మధ్య ఉందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, క్లెయిమ్‌లు అధిక సంఖ్యలో తిరస్కరణ, దీనిలో బీమా విధానాన్ని ప్రవేశపెట్టడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పేలవమైన స్థితిలో ఉన్నాయని చెప్పారు. కేన్సర్‌ రోగులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆస్పత్రులు లేవన్నారు. పిహెచ్‌సిలు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో బీమా విధానానికి స్వస్తి పలికి బలోపేతం చేయాలని కోరారు. వైరాలజీ విభాగంతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పరిశోధన కేంద్రంగా విమ్స్‌ను అభివృద్ధి చేయాలన్నారు. కాకానిలో కేన్సర్‌ డేటా సెంటర్‌ను సూపర్‌ స్పెషాలిటీ కేన్సర్‌ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని వేదిక ప్రతినిధుల బృందం.. మంత్రి సత్యకుమార్‌, సిఎంఒ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

➡️