వరద బాధితులకు రూ.602 కోటు

  • నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ
  • సమాచార పత్రాలు అందచేసిన చంద్రబాబు
  • చిట్టచివరి బాధితుడికి సాయం అందిస్తాం
  • రికార్డు స్థాయిలో విరాళాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, విజయవాడ : బుడమేరు వరద బాధితులకు రూ.602 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపిణీ చేశారు. బుధవారం విజయడలోని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వరదబాధితులకు పరిహార పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ మొత్తాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో ఆయన జమచేశారు. పరిహారం పంపిణీకి సంబంధించిన సమాచార పత్రాలను బాధితులకు లాంఛనంగా అందచేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల లైసెన్సులు లేని చిన్నచిన్న వ్యాపారాలను ఎన్యుమరేషన్‌లో పరిగణలోకి తీసుకోలేదని, వాటి యజమానులకు కూడా పరిహారం అందించాలని ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) చేసిన అభ్యర్థనకు సిఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందించడం తమ లక్ష్యమని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30వ తేదీ నాటికి నివేదికను తయారు చేసి వారికి కూడా సాయం అందిస్తామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల జాబితా ఎంపిక చేసి ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. బాదితులకు హదుద్‌, తిత్లీ కంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా భారీ పరిహారాన్ని పక్షం రోజుల్లోనే అందించినట్లు చెప్పారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ 7600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఒకే ప్రాంతంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ లేనంతగా ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చిందని తెలిపారు. గతంలో బుడమేరు ఆధునికీకరణకు రూ 57 కోట్లు ఇస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, రాజకీయ వివక్షతో ఆ పనులను రద్దు చేసిందని తెలిపారు. 11.90 లక్షల క్యూసెక్కుల సామర్థ్యమున్న ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో ఒక్కసారిగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. ప్రమాద ప్రాంతాలకు తాను స్వయంగా నాలుగైదుసార్లు వెళ్లి పర్యవేక్షణ చేశానని, దీంతో అధికారులు మరింత బాద్యతగా పనిచేశారని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు స్పందించిన తీరు అపూర్వమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రికార్డుస్థాయిలో రూ 400 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. ‘చిన్నా , పెద్ద అందరూ స్పందిచారు. వీల్‌ఛైర్‌లో సైతం వచ్చి విరాళాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 602 కోట్ల రూపాయలు బాధితుల కోసం విడుదల చేశాం. ఇందులో 400 కోట్లు దాతలు ఇచ్చినవే. అందుకే దాతలందరికీ పాదాభివందనం చేస్తున్నా.’ అని చంద్రబాబు అన్నారు.

1.14 కోట్ల వాటర్‌ బాటిళ్లు …
వరద బాధితులకు 1.14 కోట్ల వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేసినట్లు సిఎం చెప్పారు. అదే విధంగా 37 లక్షల లీటర్ల పాలు, 47 లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లు, 5 లక్షల గుడ్లు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే 1.15 కోట్ల ఆహార ప్యాకెట్లను, 5,000 క్వింటాళ్ల కూరగాయలను 2,45,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ఫైర్‌ ఇంజిన్లను ఉపయోగించి దాదాపు 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రహదారులను, వీధులల్లోని బురదను శుభ్రం చేశామన్నారు. అలాగే వరదల్లో పేరుకుపోయిన 20 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలించామన్నారు. వరద ప్రభావం 16 జిల్లాలోని 227 మండలాల్లోని 905 గ్రామాలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద 74 మంది మరణించారన్నారు.

➡️