సాధారణ ఛార్జీలతోనే దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు

Oct 1,2024 00:36 #aps rtc, #Dasara Festival

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దసరా పండగకు ప్రజల ప్రయాణాలకు ఎలాంటి సమస్య రాకుండా ఎపిఎస్‌ఆర్‌టిసి ఈ నెల 4 నుంచి 20 వరకు 6,100 ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాలతోపాటు ముఖ్య పట్టణాలన్నింటికీ ప్రత్యేక బస్సులను ఆర్‌టిసి ఏర్పాటు చేసినట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దసరా పండగ రోజుకు ముందు 3,040 బస్సులు, పండగ తర్వాత 3,060 బస్సులను నడిపేలా ప్రణాళికను రూపొందించారు. విజయవాడ నుండి ప్రతి పట్టణానికి బస్సులను నడిపేలా ప్రణాళికలను తయారు చేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు బస్సులను నడపనుంది. హైదరాబాద్‌కు 990 బస్సులు, బెంగళూరుకు 330 బస్సులు, చెన్నరు నగరానికి 70 బస్సులు వేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనంగా బస్సులు వేసేందుకు ముందస్తు ప్రణాళికలను ఆర్‌టిసి తయారు చేసుకుంది. అలాగే ప్రయాణికులు రెండువైపులా రిజర్వేషన్‌ చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీని ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి మధ్య 1,930 సర్వీసులను నడపనున్నారు. దసరా సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సిబ్బందిని ఏర్పాటు చేశారు.

➡️