తెలంగాణలో 65.67 శాతం పోలింగ్‌

  • అత్యధికంగా భువనగిరిలో 76.78, ఖమ్మంలో 76.09
  •  అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం
  •  ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ లోక్‌సభ 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65.67 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యధికంగా భువనగిరిలో 76.78 నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం ఓటింగ్‌ జరిగిందన్నారు. అదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మహబూబ్‌బాద్‌, ఖమ్మం తదితర పది జిల్లాల్లో 70 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజక వర్గాల్లో ఎప్పటిలాగే 50 శాతం లోపు పోలింగ్‌ నమోదైందని తెలిపారు. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇందులో ఓటర్‌ ఫెసిలిటీ సెంటర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ ద్వారా 2,10,771 మంది ఓటేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గతేడాది కన్నా 2.90 శాతం పోలింగ్‌ పెరిగిందని వివరించారు. అసెంబ్లీ సెంగ్మెట్ల వారీగా చూస్తే అత్యధికంగా నర్సాపూర్‌లో 84.25 శాతం, అత్యల్పంగా మలక్‌పేటలో 42.76 శాతం పోలింగ్‌ నమోదైందని, ఓట్ల పరంగా చూస్తే మేడ్చల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 3,85,149 ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా భద్రాచలంలో1,05,383 ఓట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత ఇవిఎంలను మూడంచెల భద్రత, నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు. జూన్‌ 4న కౌంటింగ్‌ కోసం ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో 34 కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు,. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

➡️