ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ ఏడాది హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెయిటింగ్ లో ఉన్న 656 మందికి అవకాశం దక్కింది. ఈ మేరకు భారత హజ్ కమిటీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండో విడత వెయిటింగ్ లిస్టులో 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 3,676 మంది హజ్ వెళ్లేందుకు తాత్కాలిక సీట్ల కేటాయించినట్లు కమిటీ పేర్కొంది. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందినవారు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వీరంతా ఈ నెల 23లోగా రూ.2,72,300 మొత్తాన్ని సంబంధిత హజ్ కమిటీలకు చెల్లించాలని, రెండు విడతల్లో చెల్లింపులు చేయవచ్చుని తెలిపింది. హజ్ యాత్రకు అసరమైన పత్రాలు అందజేసేందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇచ్చారు. రెండో విడతలో ఎంపికైన 3,676 మందిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1,092 మంది హజ్‌కు వెళ్లనున్నారు. అయితే మరిన్ని వివరాలకు భారత హజ్ కమిటీ సిఇఒ (ఆపరేషన్స్) మహ్మద్ నియాజ్ అహ్మద్‌ను 96504 26727 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపింది.