671 కిలోల గంజాయి పట్టివేత

Jan 10,2025 21:40 #671 kg ganja, #seized, #vijayanagaaram
  • ఆరుగురు అరెస్టు, ఇద్దరు పరారీ

ప్రజాశక్తి-సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామ సమీపంలో వేటగానివలస జంక్షన్‌ వద్ద 671 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి ఎస్‌వి.మాధవరెడ్డి తెలిపారు. పాచిపెంట పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఎస్‌పి తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం అందడంతో స్థానిక ఎస్‌ఐ వెంకట సురేష్‌ పోలీసు సిబ్బందితో కలిసి వేటగానివలస జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అరుకు నుంచి సాలూరు వైపు వస్తున్న రెండు బొలేరో వాహనాలను తనిఖీ చేయగా వాటిల్లో 30 ప్యాకెట్లలో 671 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయి విలువ సుమారు రూ.33.50 లక్షల వరకు ఉంటుంది. ఒడిశాకు చెందిన లక్ష్మి కాంత్‌ సెస, బత్తోరం కమెండో, తంగుల విశ్వనాథ్‌, కిల్లో వినోద్‌, బురిడి కృష్ణ, కొర్ర దంబురులను అదుపులోకి తీసుకున్నారు. రాజు, సోమనాథ్‌ అనే వ్యక్తులు పరారయ్యారు. నిందితుల నుండి గంజాయితోపాటు ఆరు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేయడం వెనుక సూత్రధారి పడువ గ్రామానికి చెందిన కిషన్‌ కూడా పరారీలో ఉన్నాడని చెప్పారు. సమావేశంలో రూరల్‌ సిఐ రామకృష్ణ, ఎస్‌ఐలు నర్సింహమూర్తి, వెంకటరమణ, వెంకట సురేష్‌ ఉన్నారు.

➡️