ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్‌లోడ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించిన ఇఎపిసెట్-2024 హాల్ టికెట్లను ఈ నెల 7 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో బైపిసి అభ్యర్థులకు, 18 నుంచి 23 వరకు ఎంపిసి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ హాల్ టికెట్లను గురువారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 6న ఈ పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ కోర్సు రెండో ఏడాది ప్రవేశాలకు సంబంధించిన ఇసెట్ హాల్ టికెట్లు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 8న ఉన్నత విద్యామండలి ఈ పరీక్ష నిర్వహించనుంది. పిజి కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన పిజిఇసెట్ హాల్ టికెట్లు ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్ష ఈ నెల 29 నుంచి 31 వరకు జరగనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని కార్యదర్శి తెలిపారు. పిహెచ్‌డి కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఆర్‌సెట్ పరీక్ష ఈ నెల 2 నుంచి 5 వరకు జరగనుంది.
